శరశర్మదంపతులు 2016 నుండి అన్నజ్ఞానసమారాధన అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అన్నసమారాధన, జ్ఞానసమారాధన అనే రెండు వాహినులతో సేవా కార్యక్రమం సాగుతున్నది. అన్నసమారాధనలో ఒక అంగం గోసేవ. ప్రధానంగా నిత్యాన్నదాన కార్యక్రమం జరిగే పరమ పవిత్రక్షేత్రం శ్రీ శృంగేరీ శారదాపీఠానికి సంవత్సరానికి రు.1,00,000/ లు (ఒక లక్ష రూపాయలు) సమర్పించుకొంటున్నారు. అలాగే భద్రాచలంలోని శ్రీమతి సరోజమ్మ చేస్తున్న అనాథ వృద్ధాశ్రమానికి కూడా రు.50,000/లు, ఒకమారు, రు.30,000 మరొకమారు సమర్పించారు. వేదపాఠశాలలలో విద్యార్థుల భోజనానికి సుమారు రు.2,00,000/లు దాకా ఇచ్చారు. ప్రకృతివిలయాల సందర్భంలో రెండు మూడు పర్యాయాలు ఒక నెల వేతనం ప్రభుత్వానికి ఐచ్ఛికంగా ఇచ్చినారు. బంధుమిత్ర వర్గాలలో వ్యక్తుల ఆరోగ్యపరిరక్షణాది నిమిత్తంగా సుమారు రెండు లక్షల రూపాయలవరకు ఇవ్వగలిగారు. ఉద్యోగవిరమణ చేసి, రాజమహేంద్రవరం చేరిన తరువాత రెండుమార్లు గోదావరి పుష్కరాల సందర్భంలోనూ బంధుమిత్రులందరూ తమ ఇంట వారి పుష్కర కార్యక్రమం నిర్వహించుకోవటానికి పురోహిత బృందాన్ని ఏర్పాటు చేసి అన్నసమారాధన చేశారు. దత్తాత్రేయ వేదవిద్యాగురుకులంలో నిర్వహణకు అనేకమార్లు రు. 16,000 చొప్పున విరాళం అంద జేశారు.ఆగిరిపల్లి శోభనాద్రీశ్వర వేద సంస్కృతపాఠశాలకు రు. 50,000/లు అందించారు.
కృష్ణాజిల్లా కొండపావులూరు గ్రామంలో గోసేవకు రు. 50,000/లు, గొల్లపల్లిలో గోసేవ చేస్తున్న ఒక వ్యక్తికి రెండుమార్లుగా రు.12,000/లు రాజమహేంద్రవరం కొంతమూరు గణపతి దేవాలయంలో గోసేవకు రు. 15,000/ లు, శృంగేరిలో గోసేవకు రు. 50,000/లు, తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో వ్యాకరణంలో ప్రథమ స్థానం పొందిన విద్యార్థికి పురస్కారంకొరకు రు. 1,00,000/లు, గొల్లపల్లి రఘునాథస్వామి ఆలయానికి రు.10,000/లు, నూజివీడులో బి.వి. మూర్తి నిర్వహిస్తున్న అన్నసమారాధనకు సుమారు రు.10,000 చొప్పున ప్రతిసంవత్సరం, రాజమహేంద్రవరంలో ప్రతిరోజు 125 మంది అన్నార్తులకు అన్నసమారాధన చేస్తున్న శ్రీ ఖాదర్ ఖాన్ గారికి రోజుకు రు.4,500/ ల చొప్పున వీలైనన్ని మార్లు, కోవిడ్.19 తో ప్రపంచమంతా అతలాకుతలం అవుతున్న సందర్భంగా శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ గ్రామాలలో పంచిపెడుతున్న హోమియో ఔషధం కొరకు రు.20,000/లు సమర్పించారు. ఇదంతా అన్నసమారాధనలో చేయగలిగిన సేవ.
జ్ఞానసమారాధనలో రెండువాహినులు. ఒకటి రచనాత్మకమైనది. రెండు ప్రవచనాత్మకమైనది. శ్రుతిస్మృతిపురాణేతిహాసాలలోని ఋషిహృదయ ఆవిష్కరణచేసే ప్రసంగాలు దాదాపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, అనంతపురం, చుట్టుపక్కల అనేక గ్రామాలు, ముంబయి, బెంగళూరు, హైదరాబాదు, మంథని, ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలోని అనేక ప్రదేశాలలో సుమారు నాలుగైదు వేల పైచిలుకు ప్రసంగాలు శరశర్మ చేసి ఉంటాడు. కరోనా విలయతాండవం చేస్తున్న ఈ కాలంలో కూడా జూమ్ మాధ్యమం ద్వారా అనేక ప్రసంగాలు వెలువడుతూనే ఉన్నాయి. ప్రధానంగా బెంగళూరు వాస్తవ్యులు డా. రాచకొండ శర్మగారు నెలకొల్పి ప్రచలితం చేస్తున్న అధ్యయనభారతి – శివపరివారం అనే సంస్థ నిర్వహించే జూమ్ మాధ్యమ ప్రసంగాలలో శ్రీభీష్మస్తవరాజజ్యోత్స్నపై నలభై వెలువడ్డాయి. ఇంకా కొనసాగుతున్నాయి. రచనాత్మకంగా వ్యాసాలు, పుస్తకాలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి.
ఈ అన్నజ్ఞానసమారాధనను గురించి ప్రకటించుకోవటంలో ముఖ్య ఉద్దేశం ఆత్మీయులలో ఒక స్పందన కలిగించటం. వారు కూడా ఇటువంటి దారిలోనికి సంతోషంతో ప్రవేశించి పయనిస్తారని ఆశ. అలా స్పందించినవారు కూడా చాలమంది ఉన్నారు. చాలా సంతృప్తికరంగా ఆ స్పందన ఉన్నది. అదే శరశర్మదంపతులను ముందుకు తీసుకొనిపోతున్నది.